5, మార్చి 2018, సోమవారం

అక్కడ ప్రమిద లేదు. వత్తి ఉండదు. నూనె పోయరు. అయినాసరే 24 గంటలు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

అక్కడ ప్రమిద లేదు. వత్తి ఉండదు. నూనె పోయరు. అయినాసరే 24 గంటలు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అక్కడ ఎవరూ తవ్వలేదు. నీళ్లు పోయరు. అయినాసరే జలధార ఉబికివస్తుంది. ఆ గుడిలో ప్రతిమలేదు. అమ్మవారి ఆకారం లేదు. కానీ వందలు వేల ఏళ్ల నుంచి వింతలకు కొదవలేదు. ఆ రహస్యాలను తెలుసుకోడానికి 175 ఏళ్ల నుంచి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. మరి ఇదంతా అమ్మవారి లీలనా? ఏదైనా రహస్యం ఉందా?
హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్డాలో ఉన్న జ్వాలాదేవీ ఆలయంలో జరిగే అద్భుతం ఇది. ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు... వందలు వేల ఏళ్ల నుంచి ఇదే తంతు. వందల ఏళ్ల నుంచి జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి. వేల సంవత్సరాల నుంచి నీటి ధారలు ఉబికివస్తూనే ఉన్నాయి. పైన జ్యోతివెలుగుతుంటే కింద ఉన్న నీరు చాలా చల్లగా ఉండడం మరో విశేషం. గతంలో ఈ నీరు వేడిగా ఉండేదని... దీంతో వంట చేసేవారని అంటారు. అమ్మవారి కరుణవల్ల నీరంతా చల్లగా మారిపోయిందనేది భక్తుల విశ్వాసం.
ఈ గుడిలో అమ్మవారికి సంబంధించిన ఎలాంటి ప్రతిమ లేదు. అమ్మవారి ఆకారం కనిపించదు. అయినాసరే వందలు, వేల సంవత్సరాల నుంచి ఇక్కడ అద్భుతాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీని వెనుక భక్తి ఉంది. నమ్మకం ఉంది. అంతేకాదు ఛేదించలేని మిస్టరీ దాగుంది.
జ్వాలా ముఖిలో 11 చోట్ల జ్యోతులున్నాయి. ఇవి నూనె, వత్తులు లేకుండా 24 గంటల పాటు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటాయి. వందల ఏళ్ల నుంచి జ్వలిస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఒక్కసారి కూడా ఆరిపోలేదు. వీటిలో ముఖ్య జ్యోతి నేల నుంచి మూడు అడుగుల లోపల ఉంది. ఈ జ్వాలనే అమ్మవారి ముఖం అని భక్తులు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని జ్వాలా ముఖిగా పిలుస్తారు. ఈ జ్యోతులకే జనం పూజలు చేస్తారు. భజనలు చేస్తారు. హారతులిస్తారు. నైవేద్యం పెడతారు. వీటిని దర్శించుకోడానికి రోజంతా ఇక్కడ భక్తులు బారులు తీరుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి